ఖైరతాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్ గేమ్స్‌పై నిషేధం ఉన్నా యథేచ్చగా ఆడేస్తున్నారని పబ్లిక్ రెస్పాన్స్ అగనెస్ట్ హెల్ప్ లెస్నిస్ అండ్ యాక్షన్ ఫర్ రిడ్రెసల్ (ప్రహార్) జాతీయ కన్వీనర్ అభయ్ రాజ్ మిశ్రా తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్ల క్రితం ఆన్లైన్ గేమ్స్ నిషేదాజ్ఞలు అమలులోకి వచ్చాయన్నారు. కాని తాము ఇటీవల జరిపిన సర్వేలో రాష్ట్రంలో రియల్ మనీ గేమ్స్ చట్టవిరుద్దమని 96 శాతం మందికి తెలిసినా ఎవరూ మానడం లేదన్నారు.
87 శాతం మంది ప్రతి రోజు ఆడుతున్నారన్నారు. అందులో డబ్బు సంపాదించడానికి 97 శాతం, వినోదం కోసం 61 శాతం మంది ఆడుతున్నారని తెలిపారు. ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినోలు విచ్చలవిడి సాగుతున్నాయన్నారు. ఈ గేమ్స్ ఆడేందుకు ఎక్కవగా సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారని తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ వల్ల యువతే ఎక్కువగా నష్టపోతుందన్నారు. మూడింట రెండు వంతుల వరకు 30 ఏండ్ల లోపు వారు ఉంటే 18 నుంచి 25 వయస్సు వారు 45 శాతం, 26-30 ఏండ్ల వయస్సు వారు 17 శతం మంది ఈ ఆన్లైన్ గేమింగ్‌కు బానిసయ్యారన్నారు.
పురుషుల్లో 78, మహిళలు 22 శాతం మంది అడుతున్నారని తెలిపారు. అయితే 94 శాతం మంది రియల్ మనీ గేమ్స్ చట్టబద్దం చేయాలని కోరుతున్నాన్నారు. అయితే 94 శాతం మంది రియల్ మనీ గేమ్సు చట్టబద్దం చేయాలని కోరుతున్నాన్నారు. ఈ ఆన్లైన్ గేమింగ్ ఉగ్రవాదంలా ప్రమాదకరంగా మారిందన్నారు. దీనిని నివారణకు నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలని, చట్టం ఉల్లంఘటన జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో లక్ష్మణ్ యాదవ్, భారతి, మహేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు.