రంగారెడ్డి, జూలై 13 (నమస్తే తెలంగాణ) : అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ప్ర భుత్వ భూములను కాపాడుతామని తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని రాగన్నగూడలో రూ. పది కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు అనే శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి.. రాగన్నగూడలోని ఆ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన షెడ్లను రేపటిలోగా తొలగించాలని వాటి నిర్వాహకులకు తహసీల్దార్ సూచించారు.
అలాగే, సర్వేనంబర్ 41లో గల 1.26 ఎకరాల ప్రభుత్వ భూ మిలో వెలిసిన షెడ్లను గుర్తించి నోటీసులు అందించి ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వ భూములు ఎక్కడ కబ్జా అయినా తమకు సమాచారమిస్తే కబ్జారాయుళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. శాటిలైట్ ద్వారా సర్వే నిర్వహించి కబ్జాకు గురైన ప్రతి అం గులం భూమినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం త్వరలోనే అధికారులతో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.