Aarogya Sri : రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ (Aarogya Sri) సేవలు శనివారం నుంచి యథావిధిగా కొనసాగనున్నాయి. ఇకపై ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narsimha) ఆరోగ్యశ్రీ నెటవర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసిన అసోసియేషన్ ప్రతినిధులు బకాయిలపై చర్చించారు. ఈ సందర్భంగా రాజనర్సింహ వాళ్లతో ప్రతి నెలా నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
అంతేకాదు హాస్పిటళ్లు కోరుతున్న ఇతర అంశాలపై కూడా త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లను మంత్రి అభినందించారు. రాజనర్సింహ చొరవతో తిరిగి ఆరోగ్య శ్రీ సేవలు శనివారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. పెండింగ్ బకాయిలు చెల్లించాలని సెప్టెంబర్ 16 అర్ధ రాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేసిన విషయం తెలసిందే.