శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18: ఆరంభ టౌన్షిప్ అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తున్నది. కొన్ని సంవత్సరాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఈ కాలనీ ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తుంది. కాలనీ ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో ఏ మాత్రం అభివృద్దికి నోచుకొని ఈ ఆరంభ టౌన్షిప్ కాలనీ నేడు బీఆర్ఎస్ హయాంలో శరవేగంగా అభివృద్ది చెందుతూ ఆదర్శవంతంగా అవతరిస్తుంది. మొత్తం 1180 ప్లాట్లు కలిగిన ఈ ఆరంభ టౌన్షిప్ ఆహ్లాదకర వాతవరణంలో సువిశాలంగా విస్తరించి ఉంది. బీఆర్ఎస్ హాయంలో కాలనీలో అభివృద్ది, సంక్షేమానికి పెద్దపీట వేయడంతో కాలనీ రూపురేఖలు మారిపోయాయి. రూ.5 లక్షల అంచనా వ్యయంతో కాలనీ పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేసి పార్కును అందంగా, అహ్లాదకరంగా తీర్చిదిద్దారు.
రూ.18 లక్షల అంచనా వ్యయంతో కాలనీలో ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేశారు. ప్రకృతి పరవళ్ల మధ్య నిత్యం కాలనీవాసులు ఈ ఓపెన్‌జిమ్‌లో వ్యాయామం చేసుకునేందుకు ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు. జీహెచ్ఎంసీ అధ్వర్యంలో ఈ ఓపెన్‌జిమ్‌లో ప్రత్యేక వ్యాయామ పరికరాలు ఏర్పాటుచేసి కాలనీవాసులకు అందుబాటులోకి తెచ్చారు.
రూ.1.80 కోట్లతో లింకురోడ్డుకు ప్రతిపాదనలు
ఆరంభ టౌన్షిప్ వెనుకభాగం నుంచి నెహ్రూనగర్ కాలనీ వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలాపై కల్వర్టు నిర్మాణం చేపట్టి దానిమీదుగా లింకురోడ్డును ఏర్పాటు చేయాలన్న కాలనీవాసుల విజ్ఞప్తుల మేరకు స్థానిక ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌లు వారం రోజుల క్రితం కాలనీలో పర్యటించి నాలాను పరిశీలించారు.
స్థానిక ఇంజినీరింగ్ అధికారులతో కలిసి నాలాపై కల్వర్టు నిర్మాణం, లింకురోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. రూ.1.80 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ లింకురోడ్డు పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి..
ఆరంభ టౌన్షిప్ కాలనీ బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ల సహకారంతో కాలనీలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న అక్యుపెన్సీ సర్టిఫికెట్లు సైతం వీరి సహకారంతో ఇటీవల అందుకోవడం జరిగింది. ఓపెన్‌జిమ్ ఏర్పాటుతో పాటు కాలనీలో పార్కులో వాకింగ్ ట్రాక్‌ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది కాలనీవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చాం.
– రవీంద్ర రాథోడ్, అధ్యక్షుడు, ఆరంభ టౌన్షిప్
మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతా
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంభ టౌన్షిప్ కాలనీలో అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో పాటు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తు మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుక చర్యలు తీసుకుంటా. కాలనీవాసుల సహకారంతో ఆరంభ టౌన్షిప్ కాలనీ భవిష్యత్తులో మంచి కాలనీగా అవతరించడంలో నా వంతు సహకారాన్ని అందిస్తా. ఆక్యుపెన్సీ కళను సాకారం చేశాం. నూతనంగా కల్వర్టు నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నాం.
– రాగం నాగేందర్ యాదవ్, కార్పొరేటర్ శేరిలింగంపల్లి