సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): సీఐడీ సీక్రెట్ అపరేషన్ సమాచారాన్ని నిందితుడికి ఇచ్చి అతడు పరారుకావడానికి సహకరించాడనే ఆరోపణలపై ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అతడిని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ తరువాత సస్పెండ్ చేసినట్లు సమాచారం. సస్పెండ్ చేసిన విషయాన్ని ఉన్నతాధికారులు ధ్రువీకరించలేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో అవతకవకలకు సంబంధించిన కేసును సీఐడీ నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా నిందితులైన ఆరు మందిని అరెస్ట్ చేసేందుకు వారం రోజుల కిందట సీఐడీ అపరేషన్ నిర్వహించింది.
ఒకేరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు మరో ఐదు మంది నిందితులను అరెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు. నిందితులకు ఎలాంటి సమాచారం అందకుండా ఉండేలా ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్‌కు సీఐడీ అధికారులు వస్తున్నట్లు సమాచారం రావడంతో ఇంటి నుంచి పరారయ్యాడు. పకడ్బందీగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నిందితుడు ఎలా తప్పించుకున్నాడనే విషయంపై సీఐడీ పోలీసులు తర్జన భర్జన పడ్డారు.
సీఐడీ నుంచి సమాచారం వెళ్లిందా? బయటకు నుంచి వెళ్లిందా? అనే విషయంపై సీఐడీ అధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి నుంచి సమాచారం వెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని సీఐడీ అధికారులు రాచకొండ సీపీ సుధీర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ను విషయం నిందితుడికి పోలీస్ అధికారే చేరవేశాడనే విషయం సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు అతనిపై చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా ముందుగా హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. తరువాత సస్పెండ్ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ సెక్రటరీ హోదాలో ఏ2 నిందితుడిగా ఉన్న దేవ్‌రాజ్ చూస్తుంటాడు. ఇతడికి అధికార పార్టీలోని కొందరు నాయకులతోనూ సంబంధాలున్నట్లు సమాచారం. సీఐడీ కేసు నమోదు కావడం.. కేసు దర్యాప్తు జరుగుతున్న విషయం కొందరు సీనియర్ నాయకులకు సమాచారం ఉన్నట్లు బయట చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆ సీనియర్ నాయకుడి నుంచే సమాచారం వెళ్లి ఉంటుందనే టాక్ సైతం నడుస్తోంది.
హెచ్‌సీఏ కార్యకలాపాలలో కీలకంగా వ్యవహరించే కార్యదర్శిని సీఐడీకి దొరకకుండా చేయడంలో భాగంగానే సదరు నాయకులు సమాచారం ఇచ్చే అవకాశాలున్నాయనే పలువురు మాట్లాడుకుంటున్నారు. వారం రోజుల కిందట ఉప్పల్ స్టేడియం దారి కబ్జాకు గురయ్యిందంటూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు. ఆ సమయంలో హెచ్‌సీఏ కమిటీ సభ్యులు ఎవరు కూడా సమాధానం చెప్పడానికి ముందుకు రాకపోవడంతో ఉప్పల్ పోలీసులు అసోసియేషన్ సభ్యులను సంప్రదించినట్లు చర్చ జరుగుతున్నది. అయితే నిందితులకు సమాచారం ఇచ్చిందెవరు అనే విషయంపై రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.
ఇన్స్పెక్టర్ పాత్ర ఉన్నట్లు తేలితే నిందితుడిని తప్పించే ప్రయత్నం చేసినందుకు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా ఉప్పల్ సీఐపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. ఓ ప్రేమ జంటను వేధించిన కేసు దర్యాప్తు సరిగ్గా చేయలేదనే ఆరోపణలపై ఎలక్షన్‌రెడ్డితో పాటు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సైని అటాచ్ చేశారు. ఆ తరువాత ఇన్స్పెక్టర్ పాత్ర ఏమీ లేదని విచారణలో తేలడంతో తిరిగి ఉప్పల్ సీఐగా బాధ్యతలు అప్పగించి, ఎస్సైపై చర్యలు తీసుకున్నారు.