Suicide | హిమాయత్ నగర్, జూన్ 15: ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన వికాస్ మాల్ (20) హిమాయత్ నగర్ వీధి నెంబర్ 14లో మిత్రులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఉపాధి కోసం నగరానికి వచ్చిన యువకుడు ఇందిరా పార్క్ సమీపంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పని చేస్తుండేవాడు.
ఈ క్రమంలో ఓ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొంతకాలం పాటు ప్రేమను కొనసాగించిన సదరు యువతీ ప్రేమను నిరాకరించడంతో మనస్థాపం చెందిన యువకుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటికి వెళ్లిన మిత్రులు తరుణ్ కుమార్, మోహన్ రూమ్‌కు వచ్చి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి డెడ్‌బాడీని తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు డెడ్‌బాడీని అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.