మెహిదీపట్నం, డిసెంబర్ 15: తన భార్య గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్న కోపంతో ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన టోలిచౌకి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్, ఇన్స్పెక్టర్ రమేష్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం& టోలిచౌకి హకీంషాకుంట ప్రాంతంలో నివసించే బిలాల్, గోల్కొండలో నివసించే అద్నాన్(23), ఇర్ఫాన్(25)లు స్నేహితులు. వీరు ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా బిలాల్ భార్య గురించి అద్నాన్ పలువురి వద్ద తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన బిలాల్.. అద్నాన్‌తో తాడోపేడో తేల్చుకోవాలని వారి ఇంటికి వెళ్లాడు. అద్నాన్ ఇంట్లో లేడని, పారామౌంట్ కాలనీకి వెళ్లాడని కుటుంబ సభ్యులు బిలాల్‌కు చెప్పారు. అయితే బిలాల్ ఆవేశాన్ని గ్రహించిన అద్నాన్ అన్న ఇర్ఫాన్.. బిలాల్‌తో పాటు పారామౌంట్ కాలనీకి వెళ్లాడు. అక్కడ బిలాల్ ‘నీ తమ్ముడి అంతు చూస్తా’నని ఇర్ఫాన్‌తో గొడవపడ్డాడు. ఈ గొడవలో అద్నాన్ అన్న ఇర్ఫాన్‌ను బిలాల్ కత్తితో పొడిచి పారిపోయాడు.
ఇది గ్రహించిన స్థానికులు వెంటనే నానల్‌నగర్‌లో ఉన్న ఒలీవ్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇర్ఫాన్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏసీపీ శ్రీను, లంగర్‌హౌస్ ఇన్స్పెక్టర్ వెంకటరాములు ఘటనా స్థలాన్ని సందర్శించి హత్య గురించి ఆరాతీశారు. సోమవారం హత్య చేసిన బిలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉస్మానియా ఆస్పత్రిలో ఇర్ఫాన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.