అమీన్పూర్, డిసెంబర్ 10: బీటెక్ విద్యార్థుల ప్రేమ.. ప్రియుడి ప్రాణం తీసింది. పెండ్లికి అంగీకరించాం… ఒకసారి ఇంటికి రావాలని ఆహ్వానించగా, ప్రియురాలి ఇంటికి వచ్చిన యువకుడిపై తల్లిదండ్రులు దాడి చేసి చంపేశారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ, ఇసుకబావిలో జరిగిన దారుణంపై అమీన్పూర్ పోలీసులు వివరాలు వెల్లడించారు. కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన కాకాణి జ్యోతి శ్రావణ్ సాయి (19) బీటెక్ చదువు కోసం మైసమ్మగూడలో ఉన్న సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాలలో చేరి ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి తల్లిదండ్రులు లేరు. పెద్దనాన్న వెంకటేశ్వర్రావు బాగోగులు చూస్తాడు. శ్రావణ్ సాయికి సంగారెడ్డి జిల్లా అమీన్‌ఫూర్ మున్సిపాలిటీ ఇసుకబావికి చెందిన తన క్లాస్మేట్ తమరుపల్లి శ్రీజాతో స్నేహం ఉంది.
ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం ఇరువురు కుటుంబ పెద్దలకు తెలిసి మందలించారు. చదువుపై ధ్యాసపెట్టాలని సూచించారు. అయినా వారు వినలేదు. దీంతో డిసెంబర్ 9న అమ్మాయి ఇంటికి శ్రావణ్ సాయిని పిలిచిన అమ్మాయి తల్లి సిరి ఒక బ్యాట్‌తో కూతురు, శ్రావణ్సాయి ఇరువురిపై దాడి చేసింది. బ్యాట్‌తో బలంగా శ్రావణ్ సాయి తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కూతురిని చికిత్స నిమిత్తం దవాఖానాకు తరలించారు. ప్రేమికుడు జ్యోతి శ్రావణ్ సాయిని ఇంటివద్దే వదిలేశారు. తెల్లవారుజామున శ్రావణ్ సాయి పరిస్థితి విషమించడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు నిజాంపేట్‌లోని దవాఖానాకు తరలించగా అప్పటికే మృతి చెందాడు. అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.