దుండిగల్, జూలై 19: మద్యం మత్తులో యువకుడు సైకోలా వ్యవహరిస్తూ.. ఓ మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. అడ్డుకోబోయినవారితో దురుసుగా ప్రవర్తించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన చోటుచేసుకుంది. గాగిల్లాపూర్కు చెందిన చైతన్య గురువారం రాత్రి మద్యం తాగి.. ఓ మహిళ తన భర్తతో ఇంటిముందు మాట్లాడుతుండగా, ఆమెతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు జుట్టు పట్టుకొని లాగాడు.
ఆమె 100 కు డయల్ చేసి ఫిర్యాదు చేయడంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేశాడే. ఆమె జుట్టును పట్టుకొని నడిరోడ్డు మీదికి లాక్కొచ్చాడు. అడ్డుకోబోయిన వారిపై బూతు పురాణం అందుకున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకొని చైతన్యను పీఎస్ కు తరలించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు చైతన్య పై కేసు నమోదు చేశారు. అయితే తమ కొడుకుపైనే పోలీస్ కేసు పెడతారా అంటూ చైతన్య కుటుంబసభ్యులు, బంధువులు బాధిత మహిళ నివాసముంటున్న ఇంటిని బలవంతంగా ఖాళీ చేయించినట్లు సమాచారం.