మేడ్చల్, జూన్ 13 : ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. మద్యం మత్తులో అతివేగంతో వెళ్తూ ద్విచక్రవాహనదారుడిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం…మేడ్చల్ పట్టణంలోని ఉమానగర్‌లో నివాసం ఉండే ఉచిత రాంకిశోర్(29) రావల్‌కోల్‌లో ఉన్న ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు.
గురువారం రాత్రి విధులకు వెళ్లేందుకు ఉమానగర్ నుంచి ద్విచక్రవాహనంపై బయల్దేరాడు. కిష్టాపూర్ రోడ్డులోని ప్రశాంతి వెంచర్ వద్దకు రాగానే కిష్టాపూర్‌కు చెందిన వాల్మీకి బాలరాజు(26) ట్రక్‌ను తాగిన మత్తులో అజాగ్రత్తగా, అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో రాంకిశోర్కు తీవ్ర గాయాలు కాగా.. ట్రక్ డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి రాంకిశోర్ అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.