బంజారాహిల్స్,ఆగస్టు 5: స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని, మద్యం తాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్ అదుపుతప్పి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం, ముక్కురాళ్ల గ్రామానికి చెందిన ఎర్రగొల్ల అనిల్‌కుమార్(23) అమీర్‌పేట ప్రాంతంలో ఓ హాస్టల్లో ఉంటూ మైండ్‌మ్యాప్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలో పనిచేస్తుంటాడు.
మంగళవారం పుట్టినరోజు సందర్భంగా అనిల్.. స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి పార్టీ చేసుకున్నారు. రాత్రి 1గంట ప్రాంతం లో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జివద్దకు స్నేహితుడు జాన్‌పాల్ బైక్‌మీద అనిల్ వచ్చాడు. అప్పటికే అక్కడున్న స్నేహితులు మహేశ్, నాగరాజు, తదితరులతో కలిసి కేక్ కట్ చేశారు. అక్కడ అరగంట సేపు గడిపిన తర్వాత హాస్టల్‌కు బయలుదేరారు. జాన్‌పాల్ బైక్ నడపిస్తుండగా వెనక అనిల్ కూర్చున్నాడు. దుర్గం చెరువునుంచి జూబ్లీహిల్స్ రోడ్ నం.45లోని బ్రిడ్జి సమీపంలోకి రాగానే మద్యం మత్తులో ఉన్న జాన్‌పాల్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి కిందపడిపోయారు.
ఈ ఘటనలో అనిల్‌కుమార్ రోడ్డుపై పడిపోవడంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు స్వల్పంగా గాయపడిన జాన్‌పాల్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. అనిల్‌కుమార్ మృతదేహాన్ని పోస్ట్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు .ఈ మేరకు మద్యం మత్తులో బైక్ నడిపించిన జాన్పాల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.