Suicide | బాలానగర్, మార్చి 3 : కాళ్లపారాణి ఆరకముందే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నరసింహారాజు తెలిపిన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం జిల్లాకు చెందిన గంట శ్రీరాములు తన కుమార్తె గంటా విజయ గౌరీ (23) బీటెక్ మూడో సంవత్సరం చదువుతుంది. కాగా గత నెల ఆరో తేదీన విజయనగరం జిల్లా నందిగామ గ్రామానికి చెందిన ఈశ్వర్ రావుతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు.
వివాహం అనంతరం నవ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చింతల్ బాల్ రెడ్డి నగర్లో నివాసం ఉంటున్నారు. విజయ్ గౌరీ తల్లి, అత్తమ్మలు ఇరువురు బాల్రెడ్డి నగర్లో నవ దంపతులతో పాటు ఉండి ఈ నెల 3వ తేదిన తిరిగి ఊరికి బయలుదేరి వెళ్లారు. శుక్రవారం భర్త ఈశ్వరరావు డ్యూటీ కోసం వెళ్లగా విజయ్ గౌరీ స్థానికంగా ఉన్న మహిళలతో కలిసి ఆలయానికి వెళ్లి వచ్చింది. సాయంత్రం 7.30 గంటలకు ఈశ్వరరావు వచ్చి విజయ్ గౌరిని పిలిచాడు. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో ఇంటి ఓనర్ సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తీసి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయ గౌరీ ఆత్మహత్యకు గల కారణాలు ఏమీ లేవని తండ్రి గంటా శ్రీరాములు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.