Hyderabad | బంజారాహిల్స్, మే 20:పెళ్లి చేసుకుంటా అంటూ వైద్యురాలిని నమ్మించి లైంగికదాడికి పాల్పడిన వైద్యుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహబూబాబాద్ లోని ఓ ఆసుపత్రిలో పీడీయాట్రిక్ నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ జర్పుల స్వామి (37) 2023లో అక్కడే మెడికోగా పని చేస్తున్న యువ వైద్యురాలు (30)తో ప్రేమలో ఉన్నాడు. కాగా అప్పటికే అతడికి పెళ్లి అయిన విషయం గురించి తెలియగా తనకు ఇష్టం లేకుండా పెళ్లి జరిగిందని, ఆమెకు నాలుగు అబార్షన్లు సైతం కా వడంతో విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నట్లు యువ వైద్యురాలిని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన ఆమె పెళ్లి కోసం సిద్ధపడింది కాగా ఎనిమిది నెలల క్రితం వైద్యురాలు నగరానికి వచ్చి ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తుంది.
ఇదిలా ఉండగా డా.స్వామి ఈ నెల 12న నేషనల్ పెడికాన్ సదస్సు నిమిత్తం నగరానికి రాగా ఆ సదస్సుకు యువ వైద్యురాలు సైతం హాజరైంది. ఇద్దరు కలిసి అదే రోజు బంజారాహిల్స్ లోని ఓ స్టార్ హోటల్ కు వచ్చారు. పెళ్లి పేరుతో నమ్మించిన స్వామి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్వామి వ్యవహార తీరును అనుమానించిన యువ వైద్యురాలు అతని గురించి ఆరా తీయగా.. భార్యకు విడాకులు ఇవ్వలేదని తేలింది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వామి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు డాక్టర్ స్వామితోపాటు అతడి తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.