Hyderabad | బంజారాహిల్స్, మే 29 : పెళ్లి చేసుకోవాలంటూ యువతిని వెంటపడి వేధిస్తుండడంతో పాటు ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించిన యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివాసం ఉంటున్న యువతి(24) జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తూ వెంకటగిరిలో నివాసం ఉంటున్న దూరపు బంధువైన ఎన్.అరవింద్ అనే యువకుడితో ఏడాది పాటు ప్రేమలో ఉంది. ఇరువురి కుటుంబసభ్యులు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో తాను పెళ్లి చేసుకోలేనంటూ యువతి తేల్చిచెప్పింది.
దీంతో గత మూడునెలలుగా ఆమెను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న అరవింద్ ప్రతిరోజూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం అపోలో ఆస్పత్రిలోని పార్కింగ్ స్థలంలో యువతిని అటకాయించిన అరవింద్ పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ నిలదీశాడు. కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తాను వ్యవహరించలేనంటూ చెప్పగా తనతో పాటు తెచ్చుకున్న బ్లేడ్‌తో చేయి కోసుకున్న అరవింద్ ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన బాధిత యువతి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 78(2), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.