Wife Suicide | మాదాపూర్, మార్చి 24 : దంపతుల మధ్య ఏర్పడిన కలహాలు.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తీవ్ర మనస్తాపంతో భార్య ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మియాపూర్‌లోని స్టాలిన్ నగర్లో అశోక్ తన భార్య భవాని, కూతురు(8 నెలలు) తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఈ నెల 23వ తేదీన అశోక్, భవాని మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భవాని ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోని కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో భర్త అశోక్‌ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ దవఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.