Wife Missing | మన్సురాబాద్, ఫిబ్రవరి 18 : రెండేండ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వివాహిత.. తన భర్తకు చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదేదో ఉట్టి చేతులతో వెళ్లలేదు.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైంది. ఈ ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా లింగంపేట మండలం జెండా గల్లీకి చెందిన బొల్లు రంజిత్, వైష్ణవి(23) రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు నాగోల్లోని అజయ్ నగర్ కాలనీలో నివాసముంటున్నారు. రంజిత్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రంజిత్ రోజు మాదిరిగానే ఈనెల 16న ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్ళాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న అతడికి భార్య వైష్ణవి కనిపించలేదు. ఆమె ఆచూకీ కోసం బంధువులు, మిత్రులందరికీ పాటు పరిసర ప్రాంతాల్లో వెతికిన జాడ తెలియరాలేదు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైష్ణవి ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో మెరూన్ కలర్ చుడీదార్ వేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె బయటకు వెళ్తున్న సమయంలో ఇంట్లోని బంగారు ఆభరణాలను తీసుకువెళ్లినట్లు భర్త రంజిత్ పోలీసులకు తెలిపాడు.