సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): బిర్యానీ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే బిర్యానీ.. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లో సైతం హైదరాబాద్ బిర్యానీ రుచి చూడని వారుండరు.. అలాంటి హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని, పరిస్థితులను, మనుషుల జీవనశైలిని బిర్యానీ వంటకంతో పోల్చుతూ చాలా చక్కగా ఒక హైదరాబాదీ ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. అత్యంత రుచికరమైన బిర్యానీ ఎలా తయారవుతుంది.. అది ఎలా నోరూరించేలా చేస్తుంది.. చాలా వివరంగా చేసిన ఈ వీడియో హైదరాబాద్ గొప్పతనాన్ని చాటి చెబుతోంది. హైదరాబాద్‌లో పుట్టకపోయినా… ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారంతా ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాదీగా మారిపోతున్న క్రమాన్ని వివరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు. ఎంతో గొప్పతనం నిండి ఉన్న హైదరాబాదీయులుగా ఉన్న వారందరూ నవంబర్ 30న ఓటు వేద్దామంటూ.. అనూజ్ గుర్వారా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆ వీడియోను 24 గంటల వ్యవధిలోనే 3.60లక్షల మంది వీక్షించారు. హిందీలో ఉన్న ఆ వీడియో పూర్తి సారాంశం ఇలా ఉంది.
‘హైదరాబాదీ బిర్యానీ ఎట్లా తయారవుతదో తెలుసా.. నేను చెబుతున్నాను. ఈ వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది. మనసు పెట్టి వినండి. ఒక డెకిసాలో బియ్యం, మటన్, మసాలా, ఉల్లిపాయలు, నెయ్యి పదార్థాలను పొర పొరలుగా వేస్తారు. ఆ తర్వాత డక్కన్తో మూసి.. దానిపై గోధుమ పిండితో వేడి గాలి బయటకు రాకుండా చుట్టేసి, మూతపైన, కింద ఎర్రని నిప్పులతో వేడి చేస్తారు. నిప్పులపై ఉడికిస్తున్న సమయంలో అందులో వేసిన బియ్యం, మటన్, మసాలా, ఉల్లిపాయలు, నెయ్యి పదార్థాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి అద్భుతమైన వాసతో కూడిన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మూత తెరిస్తే బిర్యానీ ఘుమఘుమలు వావ్.. అనేలా చేస్తాయి. ఇదే మాదిరిగా మన హైదరాబాద్ నగరం ఎలాంటి దంటే… బిర్యానీ మాదిరిగా ఉంటుంది. ఈ నగరం అన్ని కలగలిసిన డిష్ లాంటింది. హైదరాబాద్‌కు కొత్తగా ఎంతో మంది వస్తుంటారు. పాత వారితో కలిసి పోతుంటారు. ఇలా వచ్చే వారంతా ఒక్కొక్కరూ ఒక్కొక్క ఇంగ్రీడియెంట్స్గా కలిసిపోయి నగరంలో హాయిగా జీవిస్తూ ఉంటారు.
ఈ నగరం యొక్క హృదయం చాలా పెద్దది. పురాతన కాలం నుంచే ఈ నగరం ఎందరికో నీడనిస్తూ అక్కున చేర్చుకుంటుంది. ప్రతి ఒక్కరికీ ఇక్కడ చోటు ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చిన వారైనా సరే.. హైదరాబాదీగా సెటిలైపోతారు. నీవు ఇక్కడ ఎలాంటి దుస్తులు ధరిస్తావో ధరించు.. నీవు ఏం తినాలనుకుంటున్నా తిను.. నీకు దేనిపై విశ్వాసం ఉంటే దానిని నమ్ముకోవచ్చు.. మీ కల్చర్, రీతి, రివాజ్, జాతి, ధర్మం, భాష… ఇలా అన్నింటిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ, ఒకే కండిషన్.. మనమంతా ఒక్కటిగా కలిసిమెలిసి ఉండాలి. కలిసి పండుగలు చేసుకోవాలి. కలిసి పనిచేసుకోవాలి. అవసరమైతే కలిసి కొట్లాడాలి. ఎప్పుడైతే వర్షా కాలంలో రోడ్లపై సమస్యలు వస్తాయో.. అప్పుడు మనమంతా కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. హైదరాబాద్‌లో అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ నగరంలో ఎంతో ప్రశాంతమైన జీవన శైలిని గడుపుతున్న మనం.. దాన్ని కాపాడుకోవడానికి మనమంతా నవంబర్ 30న జరిగే పోలింగ్‌లో పాల్గొని నగర పౌరుడిగా ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. దయచేసి ఓటు వేయండి.. మనం హైదరాబాదీయులం.. తెలంగాణ వాళ్లం.. మనమంతా బిర్యానీ మాదిరి. వేర్వేరుగా ఉండి పోకుండా ఎల్లప్పుడూ కలిసి కట్టుగా ఉండాలి. ఓటు మాత్రం తప్పకుండా వేద్దాం’.. అంటూ అనూజ్ గుర్వారా హైదరాబాద్ నగరం ప్రత్యేకతలపై రూపొందించిన 3 నిమిషాల వీడియో లక్షలాది మంది నెటిజన్లను ఆకట్టుకుంది.
ఇలా ఒక్కరే కాదు.. వేలాది మంది నెటిజన్లు ట్విట్టర్లో హైదరాబాద్ నగరంపై రకరకాల రూపాల్లో పోస్టులను చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నత విద్యావంతులు, సంపన్నులు, ప్రముఖలు ఎక్కువగా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. కొందరు సాఫ్ట్వేర్ నిపుణులు, వ్యాపారవేత్తలు సొంతంగా డ్రోన్ కెమెరాలను వినియోగించి హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిపై చేసిన వీడియాలు వైరల్‌గా మారాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన అభివృద్ధి పనులపై నిపుణులు పలు వీడియోలను రూపొందించి పోస్టు చేశారు. ప్రత్యక్షంగా హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూడని వారికి ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియోలు దేశ, విదేశాలకు చెందిన వారు ఎంతో ఆసక్తిగా చూస్తూ, నగరం చాలా అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోందంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Hum Biryani Hain! ❤️#Hyderabad #Telangana#HumBiryaniHain#TelanganaElections2023 #TelanganaElection2023 #TelanganaElections pic.twitter.com/gRa8DIGPnb
— Anuj Gurwara (@AnujGurwara) November 27, 2023