Hyderabad | వెంగళరావునగర్, మార్చి 11 : అరిష్టాలు తొలగిపోతాయని.. పంచలోహ విగ్రహాలను ఓ ఇద్దరు మహిళలు చోరీ చేశారు. ఈ విగ్రహాల చోరి కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. భక్తుల రూపంలో వచ్చిన ఇద్దరు మహిళలు తమ మాటలతో అర్చకుడిని బోల్తా కొట్టించి దేవుళ్ళను ఎత్తుకెళ్లారు. సీసీటీవి ఫుటేజ్‌లో లభ్యమైన వీడియో దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆ మహిళా దొంగల్ని అరెస్ట్ చేసి వారి నుంచి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. ఏసీపీ వెంకటరమణ, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డీఐ ఎం గోపాల్, డీఎస్సై సూరజ్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తినగర్‌లోని శ్రీ వినాయక టెంపుల్‌కు ఈనెల 8వ తేదీ ఉదయం బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన స్వర్ణలత(29), పావని(26)లనే ఇద్దరు మహిళలు భక్తుల వేషంలో వచ్చారు. గర్భగుడిలో పూజలు చేసిన అర్చకుడు నవీన్ కుమార్ తీర్ధ ప్రసాదాలను భక్తులకు పంచి పెడుతుండగా.. అదునుచూసి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను స్వర్ణలత, పావని కాజేశారు. వెంట తెచ్చుకున్న చేతి సంచిలో పంచలోహ విగ్రహాలను వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు.
కొద్ది సేపటి తర్వాత గర్భగుడిలోకి వెళ్లిన అర్చకుడికి అక్కడ దేవుళ్ళు కనిపించలేదు. ఆలయ ఈఓ నరేందర్ రెడ్డికి చెప్పగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుడిలోని సీసీటీవి ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇద్దరు మహిళలు భక్తుల్లా వచ్చి ఈ చోరీకి పాల్పడినట్లు గ్రహించారు. ఎన్బీటీ నగర్‌కు చెందిన స్వర్ణలత, పావనిలే చోరీకి పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో మహిళలిద్దర్నీ అరెస్ట్ చేసి.. వారివద్ద నుంచి పంచలోహ శివపార్వతుల విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
గడిచిన రెండేళ్లలో స్వర్ణలత ఇంట్లో వరుసగా నలుగురు మరణించారు. తల్లిదండ్రులతో పాటు ఆమె ఇద్దరు సోదరులు వెంటవెంటనే చనిపోవడంతో ఇంటికేదో అరిష్టం ఉందని.. అందుకే ఇంటికి కీడు జరుగుతుందని స్వర్ణలత భావించింది. నిత్యం పూజలందుకునే మహిమాన్వితులైన ఆదిదేవుళ్లను గుడిలో నుంచి కాజేసుకుని ఇంటికి తెచ్చుకుని.. ఇంట్లో పెట్టుకుంటే అరిష్టాలు తొలగి సకల శుభాలు చేకూరుతాయని భావించి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో మహిళా దొంగలు వెల్లడించారు. పట్టుబడ్డ ఈ ఇద్దరు మహిళలకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని ఏసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. దేవాలయంలోని పంచలోహ విగ్రహాల చోరి కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.