Hyderabad | బొల్లారం, ఏప్రిల్ 5 : బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుల్లారెడ్డి బంగ్లా సమీపంలో విధులు నిర్వహిస్తున్న బోయిన్పల్లి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ కాంత్‌ను షోయబ్ అనే వాహనదారుడు దుర్భాషలాడాడు. అనంతరం దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బోయిన్పల్లి ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహించారు.
ఇదే సమయంలో బాపూజీ నగర్ నుండి బోయిన్పల్లి క్రాస్ రోడ్ వైపునకు బుల్లెట్ వాహనంపై వెళ్తున్న షోయబ్‌ను ట్రాఫిక్ పోలీసులు ఆపారు. వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు చూపించాలని అడిగారు. వాహనానికి ఫోకస్ లైట్లు ఉన్నాయని ప్రశ్నించడంతో.. ఆగ్రహానికి గురైన వాహనదారుడు షోయబ్ తన వాహనాన్ని ఆపుతారా..? బండిపై చేయి తీయు అంటూ తమపై దుర్భాషలాడాడని ఎస్ఐ విజయ్ కాంత్ తెలిపారు. వెంటనే పోలీసులు అతన్ని వారించే ప్రయత్నం చేసినప్పటికీ షోయబ్ ఇష్టారీతిగా వ్యవహరించి తమపై దాడి చేసేందుకు యత్నించాడని ఎస్ఐ పేర్కొన్నారు.