జూబ్లీహిల్స్,డిసెంబర్13: రహ్మత్‌నగర్ డివిజన్లో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఎస్పీఆర్ హిల్స్‌ను డివిజన్‌గా ప్రకటించే వరకు విశ్రమించబోమని కొత్తగా ఏర్పాటుచేసిన కార్మికనగర్తో పాటు 25 బస్తీల కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎస్పీఆర్ హిల్స్ రెండు బొమ్మల కూడలిలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రహ్మత్‌నగర్ డివిజన్లో ఉన్న 36 బస్తీలలో సింహభాగం ఎస్పీఆర్ హిల్స్‌లో ఉండటమే కాకుండా గత 15 ఏండ్లుగా సబ్ డివిజన్‌గా గుర్తింపు పొందినట్లు తెలిపారు.
4 దశాబ్దాలుగా ఒకే గొడుగు కింద ఉన్న ఎస్పీఆర్ హిల్స్‌ను అధికార కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలు చేసి ఈ ప్రాంత ప్రజల ఐక్యతను దెబ్బతీయాలని చూస్తోంన్నారు. రహ్మత్‌నగర్‌లో ఒక బస్తీగా ఉన్న కార్మికనగర్ను కొత్త వార్డుగా ప్రకటించి 2009 నుంచి డివిజన్ కోసం పోరాడుతున్న స్థానికుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. ఎస్పీఆర్ హిల్స్ బస్తీలను రహ్మత్‌నగర్, కార్మికనగర్ వార్డులకు పంచడంతో పాటు మరికొన్ని బస్తీలను బోరబండ డివిజన్లో కలపడం మరింత విడ్డూరంగా ఉందన్నారు.
వ్యతిరేకిస్తున్న స్థానికులు..
జీహెచ్ఎంసీ అధికారులు అశాస్త్రీయంగా చేసిన ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. ఒకవేళ పీజేఆర్ తల్లిదండ్రులైన శివమ్మపాపిరెడ్డి పేరు లేకుండా చేసేందుకు ఈ చర్యలకు పాల్పడి ఉంటే ఎస్పీఆర్ హిల్స్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పోరాడేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రభుత్వానికి వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు.
పేద ప్రజల పెన్నిధిగా ఉన్న పీజేఆర్ తల్లిదండ్రుల పేరుతో స్వయంగా పీ.జనార్ధన్‌రెడ్డి ఏర్పాటుచేసిన ఎస్పీఆర్ హిల్స్ పేరును కాపాడుకుంటామని.. ఎస్పీఆర్ హిల్స్ డివిజన్ సాధించి పీజేఆర్‌కు ఘనమైన నివాళి అర్పిస్తామని వెల్లడించారు. ప్రజల డిమాండ్ నెరవేర్చాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీఆర్ హిల్స్ ఉమ్మడి బస్తీల అధ్యక్షుడు జేపీ జ్ఙానేశ్వర్, సలహాదారు ఓర్సు అడ్వయ్య, ఆయా బస్తీల అధ్యక్షులు సంజీవరావు, శాంతి కుమార్, కేశవులు, ఆండాళు, నందూ నాయక్, పల్లె సాయిలు, ఎం.తిరుపతి పాల్గొన్నారు.