బంజారాహిల్స్, మే 11: బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని ఉదయ్‌నగర్ నుంచి తాజ్ బంజారా చెరువు వైపు వెళ్లే వరదనీటి నాలాను ఆనుకుని నిర్మాణాలు వివాదాన్ని రాజేశాయి. షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403లో ప్రభుత్వ రికార్డుల్లో జీ-నాలాగా ఉన్న స్థలంలో శనివారం నుంచి గున్నా జైదీప్‌రెడ్డి, గున్నా సందీప్‌రెడ్డి అనే వ్యక్తులు ఫెన్సింగ్ పనులు చేస్తున్నారు. వారికి చెందిన ప్లాట్ నంబర్ 3బీకి వెనకాల నాలా బఫర్ జోన్లో ఫెన్సింగ్ వేస్తుండడంతో స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమకు జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నాయని, నీటి పారుదలశాఖ నుంచి వచ్చిన ఎన్వోసీ ఉందని చెప్పారు.
దీంతో పాటు తమ పనుల్లో జోక్యం చేసుకోకుండా కోర్టులో ఆదేశాలు సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై లోతుగా విచారించగా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ నాలాగా పిలిచే ఉదయ్‌నగర్ నాలాలో ఎడమవైపు సుమారు 400 గజాల ఖాళీ స్థలం ఉంది. నాలా బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా గత ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఈ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా పేర్కొని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా 2023 అక్టోబర్‌లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో జీహెచ్ఎంసీ బీపాస్ ద్వారా జైదీప్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలు ప్లాట్ నంబర్ 3బీలో భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్థలంలో నాలా ఉండడంతో నీటిపారుదలశాఖ క్లియరెన్స్ కోసం వెళ్లింది. మొత్తం 692.79 చదరపు మీటర్ల స్థలంలో నిర్మాణం కోసం అనుమతులు కోరగా నాలా నుంచి 2మీటర్ల మేర బఫర్ జోన్ వదిలిపెట్టాల్సి ఉంటుందని అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో 16.76 చదరపు మీటర్ల స్థలం బఫర్ జోన్లోకి వస్తుందని, మిగిలిన 676 చదరపు మీటర్లలో నిర్మాణాలను చేపట్టుకోవచ్చని నీటిపారుదలశాఖ అధికారులు ఎన్వోసీ జారీ చేశారు.
అయితే ఎన్వోసీ కోసం ఇచ్చిన దరఖాస్తులో 676 చదరపు మీటర్ల స్థలం చూపించిన నిర్మాణదారులు జీహెచ్ఎంసీ అనుమతి కోసం పెట్టిన దరఖాస్తులో ఏకంగా 1005 చదరపు మీటర్ల స్థలంలో ప్లాన్ చూపించడం, సర్వే నంబర్ 403 ప్రభుత్వ భూమి కావడంతో మరింత స్పష్టతకోసం రెవెన్యూ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందంటూ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ దరఖాస్తును తిరస్కరించారు.
ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరిలో మరోసారి బీ పాస్ ద్వారా గున్నా జైదీప్‌రెడ్డి, సందీప్‌రెడ్డి తరపున శివరాజ్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పర్యటన చేయకపోవడంతో పాటు కనీసం రెవెన్యూ క్లియరెన్స్ లేకుండానే జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. అయితే ఎన్వోసీలో చూపిన విధంగా 2మీటర్ల మేర బఫర్ జోన్ ఉండగా కేవలం 1మీటర్ బఫర్ జోన్ వదిలిపెట్టి ఫెన్సింగ్ నిర్మాణం చేస్తున్నారు.
దీంతో పాటు తమ స్థలం పక్కనున్న సుమారు 300 గజాల ఖాళీ స్థలాన్ని కూడా ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల వ్యవహారశైలి అనుమానాలను కలిగించేలా ఉందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. సుమారు 30ఏళ్లుగా బస్తీవాసులకు ఉపయోగంగా ఉన్న 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని, కోర్టు ఆర్డర్ పేరుతో తన స్థలానికి పక్కనున్న స్థలాన్ని కూడా ఆక్రమిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.