Hyderabad | హైదరాబాద్ కుషాయిగూడలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. చోరీ కోసం వచ్చిన దొంగను అడ్డుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో అతను చనిపోయినట్లు వాచ్మెన్ రంగయ్య తెలిపాడు.
వాచ్మెన్ కథనం ప్రకారం.. కుషాయిగూడలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోకి రాత్రి సమయంలో ఓ వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. హుండీ, ఓ ప్రతిమను ఎత్తుకుని వెళ్లడం గమనించిన వాచ్మెన్ అతన్ని అడ్డుకున్నాడు. దీంతో అతను వాచ్మెన్పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునేందుకు వాచ్మెన్ కూడా దగ్గర ఉన్న కర్రతో బలంగా కొట్టాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు వాచ్మెన్ రంగయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.