సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : వెనుకబడిన బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్దేశించిన బీసీ ఆర్థిక సాయం కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. వంత శాతం ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ జిల్లాలోని అర్హులైన బీసీ లబ్ధిదారులందరికీ ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 15 నియోజక వర్గాల వారీగా బీసీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 300 మందిని లబ్ధిదారులను ఎంపిక చేయగా, నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు మొత్తం 4,021 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బీసీ ఆర్థిక సాయం కోసం జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాల నుంచి 20,600 దరఖాస్తులు స్వీకరించారు. 16,197 మంది అర్హులుగా తేలారు. ప్రాధాన్యత క్రమంలో లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేసినట్లు అధికారులు పేర్కొన్నారు.