కొందరు మహిళా ఉద్యోగులు సామాజిక సేవలో నిమగ్నమవుతున్నారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. అభాగ్య మహిళలకు ఉపాధినిచ్చి బాసటగా నిలుస్తున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహిళా మణులపై ప్రత్యేక కథనం..
– సిటీబ్యూరో, మార్చి 6 (నమస్తే తెలంగాణ)
ఆమె పేరు దుర్గ కల్యాణి. ఐటీ ఉద్యోగి. సర్కారు స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగానే అన్ని వసతులతో చదువుకునేలా తమ వంతుగా సాయం అందిస్తూ పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్-పటేల్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థులకు లక్ష రూపాయల విలువజేసే 22 బెంచీలను అందించారు. బట్టలు, పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. తమ జగతి ఫౌండేషన్‌ను సంప్రదిస్తే సేవలు అందిస్తామని ఆమె తెలిపారు.
ఆమె పేరు పావని. ఫార్మా కంపెనీలో ఉద్యోగం. తనకు వచ్చే జీతంలో 25 శాతం సహాయ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ‘ఆకలితో ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను. సమాజ శ్రేయస్సు కోసం జరిగే ప్రతీ కార్యక్రమంలో నా పాత్ర ఉండాలని అనుకుంటా. ఆకలితో బాధపడే వారు రోడ్లపై కనిపిస్తే మా 8688577703 నంబర్‌కు ఫోన్ చేస్తే వారికి ఆహార పాకెట్టు అందిస్తా’ అని అన్నారు.
ఆమె పేరు డాక్టర్ సాజిదాఖాన్, దేశంలోనే మొదటి మహిళా సౌండ్ ఇంజినీర్. ఎంత బిజీగా ఉన్నా ఆమె సామాజిక సేవ కోసం సమయం కేటాయిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళుతూ బాలికల ఆరోగ్యం, అవసరాలు తెలుసుకుంటూ అండగా నిలుస్తున్నారు. ప్రతి నెల 150 మంది వితంతువులకు ఫయాజ్ చారిటెబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. సురక్ష మిషన్ ద్వారా బాలికల ఆశ్రమంలో వారికి అత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. 9059695714 నంబర్‌కు ఫోన్ చేస్తే మాకు వీలైనంత సాయం అందిస్తామన్నారు.
ఆమె పేరు రీనా హిండొక. టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్‌తో మురికివాడల్లో నివసించే బాలికల ఆరోగ్య, స్థితిగతులను తెలుసుకోవడం.. పోషకాహారం గురించి వారు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను అర్థం చేసుకొని బాసటగా నిలుస్తున్నారు. ‘విరియా’ (సరైన ప్రయత్నం) థీమ్‌తో అర్హులైన అమ్మాయిలకు ఉన్నత చదువుల కోసం స్కాలర్ షిప్ లను సైతం అందిస్తారు. ఎంపికైన ప్రతి అమ్మాయి పేరు మీద సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను కూడా అందిస్తారు. ఆరోగ్య బీమా, ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన ల్యాప్ టాప్. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక, డిజిటల్ సమ్మిళితం వంటి అన్ని రంగాల్లో ప్రతి అమ్మాయికి సాధికారత కల్పిస్తున్నదీ ఫౌండేషన్.