మేడ్చల్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమలలో పనిచేసే కార్మికుల భద్రతకు భరోసా లేకుండా పోయింది. అధికారులు నామ్‌కే వాస్తే తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటన్నారనే విమర్శలున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఇటీవలె రెండు ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల భద్రతపై తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అధికారుల బాధ్యతలేమి కారణంగా పాశమైలారం సంఘటన మరువకముందే జిల్లాలోని పారిశ్రామికవాడలోని అల్కలాయిడ్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలిన ఘటనలో శ్రీనివాస్‌రెడ్డి అనే కార్మికుడికి త్రీవ గాయాలయ్యాయి. అయితే బాయిలర్ పేలిన సమయంలో ఆ ప్రాంతంలో కార్మికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
కార్మికుల భద్రతపై యాజమాన్యాల నిర్లక్ష్యం..
ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మికుల భద్రతపై పరిశ్రమల యజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మికుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లను పాటించకపోవడం, ప్రమాదకర కెమికల్స్, ఎక్విప్మెంట్స్ సరిగా వినియోగించకపోడంతో పాటు యంత్రాలు, కెమికల్ రియాక్టర్లపై పూర్తిగా అవగాహన కలిగిన నిపుణులు లేకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫ్యాక్టరీలను తరచూ నిపుణలతో తనిఖీలు చేయించి లోపాలు ఉంటే సరిచేయడంతో పాటు ప్రమాద సమయంలో అవసరమయ్యే పరికరాలను యాజమాన్యాలు అందుబాటులో ఉంచాలి, అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు కార్మికులు ఎలా తప్పించుకోవాలి, ప్రమాద నివారణ చర్యలపై వారికి శిక్షణ ఇప్పించాలి. అయితే వీటన్నిటికి ఆర్ధికభారం అవుతుందనే కారణంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం చేయడంతోనే ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందనే విమర్శలున్నాయి.
తనిఖీలపై దృష్టిసారించని అధికారులు
ఫ్యాక్టరీలలో ప్రతి 6 నెలలకోసారి సంబంధిత ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేసి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీ యంత్రాలు కండిషన్లో ఉన్నాయా, యంత్రాల వద్ద పనిచేసే వారిలో నిపుణులు ఉన్నారా లేదా, ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పరిశీలించి ఫ్యాక్టరీలను సర్టిఫై చేస్తారు.
ఇలా చేస్తే 90శాతం ప్రమాదాలు జరిగే అస్కారమే ఉండదు. అయితే అధికారులు ఫ్యాక్టరీల యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకొని నామమాత్రపు తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటన్నారనే విమర్శలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధిక పరిశ్రమలు ఉండగా లక్షలాది మంది కార్మికులు వాటిలో పనిచేస్తున్నారు. ఇప్పటికైనా కార్మికుల భద్రతకు ప్రభుత్వం భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికుల కుటుంబ సభ్యులు, ప్రజలు కోరుతున్నారు.