సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని ప్రైవేటు స్థలంగా చిత్రీకరించి ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు విక్రయించే క్రమంలో రూ.2 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసగాడిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఈవోడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ కథనం ప్రకారం…మేడ్చల్ జిల్లా, సూరారం ప్రాంతానికి చెందిన ఎన్వీవీ సుబ్రహ్మణ్యం సూరారం కాలనీలోని నిఖిల సాయి మైత్రేయ మధుసూదన సరస్వతీ పీఠంలో పూజారి.
అయితే మెదక్ జిల్లా, శివంపేట మండలంలో ఓ ఖాళీ స్థలం కొని అక్కడ దేవాలయాన్ని నిర్మించాలని భావించి, అనువైన ఖాళీ స్థలం కోసం అన్వేషిస్తుండగా, 2018లో శివంపేట తహసీల్దార్ కార్యాలయంలో మెదక్ జిల్లా, శివంపేట మండలం, రత్నాపూర్ గ్రామానికి చెందిన ఉదండపురం నర్సింహులు పరిచయమయ్యాడు. తాను తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగినని, త్వరలో తనకు డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతి రానున్నట్లు నర్సింహులు నమ్మబలికాడు. దీంతో పూజారి సుబ్రహ్మణ్యం తాను స్థానికంగా ఒక దేవాలయ నిర్మాణానికి యోచిస్తున్నానని, అందుకోసం అనువైన ఖాళీ స్థలం కోసం వెతుకుతున్నట్లు వివరించాడు. దీంతో తాను దేవాలయం నిర్మాణానికి అనువైన స్థలాన్ని చూపిస్తానని చెప్పి..
శివంపేట మండలంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పూజారికి చూపించాడు. ఆ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో నకిలీ పత్రాలు సృష్టించి.. బాధితుడికి చూపించాడు. బాధితుడు నుంచి అడ్వాన్స్‌గా రూ.1.20 కోట్లు తీసుకున్నాడు. అదే తరహాలో మరో బాధితుడు ఆలెటి కుమార్ వద్ద నుంచి కూడా రూ.50 లక్షలు వసూలు చేశాడు. కానీ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించకుండా కాలయాపన చేస్తుండడంతో అనుమానం వచ్చిన బాధితులు.. సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరిపి నిందితుడు నర్సింహులును అరెస్టు చేశారు.