Hyderabad | హైదరాబాద్ : ఓ వ్యక్తి నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు. బంధువుకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆమెకు తెలియకుండానే అమ్మేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌కు చెందిన దీప్తి(40) వద్ద భారీగా బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీంతో ఆమె బ్యాంకు లాకర్లో భద్రపరచాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన బంధువు వెంకట రమణను ఆశ్రయించింది దీప్తి. ఈ ఏడాది జనవరి నెలలో బంజారాహిల్స్‌లోని ఓ ప్రయివేటు బ్యాంకులో వెంకట రమణ పేరిట దీప్తి బంగారు ఆభరణాలను లాకర్లో భద్రపరిచింది.
అయితే వారం రోజుల క్రితం దీప్తి, వెంకటరమణ కలిసి బ్యాంక్‌కు వెళ్లి బంగారు ఆభరణాలను పరిశీలించగా, అవి కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంకట రమణనే బంగారు ఆభరణాలను విక్రయించి ఉంటాడని భావించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, చేసిన నేరాన్ని అంగీకరించాడు.