Police Stadium | సిటీబ్యూరో: గోషామహల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనాన్ని నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో ఈమేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం గోషామహల్లో ఉన్న పోలీస్స్టేడియానికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించేందుకు బహదూర్‌పురలోని పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీలోని స్థలాన్ని పరిశీలించారు. త్వరలో ప్రభుత్వానికి స్థలం అప్పగింతపై నివేదిక ఇస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భాస్కర్, ఇన్చార్జి ఆర్డీఓ జ్యోతి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే అజమాబాద్లోని ఎస్ఆర్టీ నగర్ కాలనీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ దశరథ్ సింగ్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్ ఉన్నారు.