Hyderabad | కవాడిగూడ, జూన్ 1: దోమలగూడలోని ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల (1991) పూర్వ విద్యార్థుల సమ్మేళనం కళాశాలలో ఆదివారం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి 70 మందికి పైగా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు. ఇందులో పాల్గొనేందుకు వస్తున్న కరీంనగర్ జిల్లాకి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కడారి రవికుమార్(57) సిద్దిపేట సమీపంలో కొమురవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో ఆత్మీయ సమ్మేళనం రవికుమార్ సంతాప సభగా మారింది.
తమతో పాటు చదువుకున్న పూర్వ విద్యార్థి రవికుమార్ మృతిచెందాడన్న వార్త వ్యాయామ ఉపాధ్యాయులను తీవ్ర విశాదానికి గురిచేసింది. ఆయన మృతిపట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న రవికుమార్ కరీంనగర్ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయసంఘం అధ్యక్షుడిగా జిల్లా క్రీడల సమాఖ్య నిర్వహణ కార్యదర్శిగా ఆయన అందించిన సేవలను వారు కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ కోశాధికారి, ఓయూ ప్రొఫెసర్ రాజేష్‌కుమార్, తెలంగాణ జూనియర్ కాళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి.లక్ష్మయ్య, రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సోమన్న, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎ.బాలరాజు, ఉపాధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్లు రవికుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు.