సిటీబ్యూరో, ఫిబ్రవరి 26(నమస్తే తెలంగాణ): సిటీలోని సౌత్‌జోన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు ఇటీవల ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ క్లిక్ చేస్తే ప్రార్థనా మందిరానికి తగిన నిధులిస్తామంటూ ప్రకటన ప్రత్యక్షమైంది. అది నిజమని నమ్మిన బాధితుడు మాయగాళ్లతో మాట్లాడి బ్యాంక్ అకౌంట్ వివరాలు పరిశీలించడానికి కొంత డబ్బులు జమ చేయాలని అడగడంతో దశలవారీగా రెండు లక్షల రూపాయలు కొట్టాడు. ఆ తర్వాత వారు స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
– నగరంలోని సెంట్రల్‌జోన్‌కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో ఓ ప్రకటన చూశాడు. విదేశాల్లో ఉన్న తమ వర్గానికి చెందిన ప్రజలకు సాయం చేయాలంటూ ఆ పోస్ట్ సారాంశం. తనకు ఉన్న సేవాభావంతో వెంటనే అవతలి వారిని యాప్ ద్వారా సంప్రదించి వివరాలు అడిగి తీసుకున్నాడు. ఆ తర్వాత తనకు తెలిసిన వారి దగ్గరి నుంచి విరాళాలు సేకరించి వారు సూచించిన బ్యాంకు ఖాతాలో వేశాడు. మళ్లీ సంప్రదించే ప్రయత్నం చేస్తే వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు. లోతుగా వెళ్లి ఆరా తీస్తే అది ఫేక్ అని తెలిసేసరికి ఖంగుతిని పోలీసులను ఆశ్రయించాడు.
ఇలాంటి ఒకట్రెండు ఘటనలు మాత్రమే కాదు.. నెలలో సుమారుగా ఐదు నుంచి ఆరు సంఘటనలు ఇలాంటివే జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో సేవా కార్యక్రమాల వైపు యువత మొగ్గు చూపుతున్నది. ఎవరికైనా సహకారం కావాలంటే స్వయంగా రంగంలోకి దిగి సహకరించడమే కాకుండా అవసరమైన నిధులను తమ స్నేహితులు, బంధువుల వద్ద సేకరించి పంపుతున్నారు. ఇది మంచిదే అయినా అపాత్రదానం జరుగుతున్నదని, చేరవలసిన వారికి చేరకుండా సైబర్ నేరగాళ్లకు ఇది ఒక అవకాశంగా మారుతుంది. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ప్రతీ అంశాన్ని సొమ్ము చేసుకోవడంలో సైబర్ నేరగాళ్లు సక్సెస్ అవుతున్నారు. ప్రార్థనా మందిరాలకు విరాళాలు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత వైద్యం చేయిస్తామని, పేద పిల్లలకు ఉచిత విద్య అంటూ ఏదో ఒక సాయం చేయాల్సిన కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. అందుకు తగినట్లుగా ఫొటోలు కూడా డిజైన్ చేస్తారు.
ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేసి విద్యావంతులను అట్రాక్ట్ చేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆలోచన ఉన్న వారు ఇలాంటి వాటిని నిజమని నమ్ముతున్నారు. తాము చేస్తున్న సాయం సరైన వాళ్లకు చేరుతుందా? లేదా? చెక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా డైరెక్ట్‌గా వారు చెప్పిన అకౌంట్స్‌లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఒక ఎత్తైతే, మీరే విరాళాలు సేకరించి పంపండంటూ వచ్చే లింకులను ఓపెన్ చేసి తమ డబ్బులు పోగొట్టుకుంటున్న వారు ఇంకొందరు ఉన్నారు. ఇలా ఒక్క నెలలోనే సుమారుగా ఏడు నుంచి ఎనిమిది కేసులు సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
సేవా కార్యక్రమాలు చేస్తామని..!
విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు, ట్రస్ట్‌లు, స్వచ్ఛంద సంస్థలు భారత్‌లో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయంటూ మెసేజ్‌లు పెడుతారు. చాలా మందికి వారి మొబైల్స్‌కు మెసేజ్‌లు, లింకులు పంపుతుంటారు. అవి నిజమని నమ్మించడానికి అవసరమైన వేదికలు కూడా క్రియేట్ చేస్తారు. మొదటగా నమ్మకం కలిగించడానికి రూ.5 నుంచి రూ.10వేలు బాధితుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆ తర్వాత స్పందించిన వారి ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంకు ఖాతాలు, ఇతర లావాదేవీలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసేందుకు ముందుగా ట్యాక్స్ చెల్లించాలంటూ రూ.లక్షలు కొట్టేస్తున్నారు. ఇలా మోసపోయామంటూ చాలా మంది విద్యావంతులే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల పేరిట వచ్చే లింక్‌లు, సేవలు, విరాళాల పేరిట వచ్చే ప్రకటనలు నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు పోయిన వెంటనే జీరో అవర్‌లో 1930కి ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.