Hyderabad | బంజారాహిల్స్, మార్చి 19 : తన భార్యతో సన్నిహితంగా ఉంటున్నావ్ అంటూ అనుమానంతో ఓ యువకుడిపై కత్తితో దాడి చేయడంతో పాటు అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే ఫిలింనగర్ బసవతారకం నగర్లో నివాసం ఉంటున్న షేక్ అబ్దుల్ రెహమాన్ (25) కార్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. ఇంటి పక్కన ఉండే రాజమణి అలియాస్ నజియా బేగం, ఆమె కొడుకు షేక్ అర్బాజ్‌తో రెహమాన్‌కు స్నేహం ఉంది. కాగా గత కొంతకాలంగా నజియా బేగం కుమార్తె తన తల్లి ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఆమె భర్త మహ్మద్ అమీర్ దోపిడీ కేసులో అరెస్టు అయి జైలుకి వెళ్ళాడు.
కాగా జైలులో ఉన్న అమీర్‌కు తన భార్యకి, ఇంటి పక్కన ఉండే మహ్మద్ షోయబ్‌కు మధ్యన స్నేహం ఉందంటూ అనుమానం ఉంది. ఇదే విషయాన్ని గురించి జైల్లో ములాఖాత్ కోసం వెళ్లిన భార్యను నిలదీయడంతో పాటు బయటకు వచ్చిన తర్వాత షోయబ్ అంతు చూస్తా అంటూ బెదిరించాడు. ఈ క్రమంలో ఈనెల 17న జైలు నుంచి బయటకు వచ్చిన మహ్మద్ అమీర్ నేరుగా షోయబ్ ఇంటికి వచ్చి బయట కాపు కాశాడు. తలుపు సందులోంచి బయటకు చూడగా పెద్ద తల్వార్ చేతిలో పట్టుకుని ఇంటి బయట కనిపించాడు. దీంతో ఆందోళనకు గురైన షోయబ్ తన బంధువులకు చెప్పగా వారు వచ్చి అమీర్‌ను పంపించి వేశారు. కొంత సేపటికి అక్కడి నుంచి బయటకు వెళ్ళగా మహాత్మా గాంధీనగర్ వద్ద కత్తితో న్యూసెన్స్ చేయడంతో పాటు షోయబ్ మీద కత్తితో దాడి కోసం యత్నించాడు. ఈ మేరకు బాధితుడు షోయబ్ మంగళ వారం రాత్రి ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.