సిటీబ్యూరో, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): మ్యాజిక్ బ్రిక్స్‌లో రెస్టారెంట్స్ రివ్యూస్ రాసేందుకు పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన సైబర్‌నేరగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగికి రూ.6.4 లక్షలు బురిడీ కొట్టించారు. అల్వాల్‌కు చెందిన బాధితుడికి టెలిగ్రామ్ యాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ పంపించిన యువతి తాను మ్యాజిక్ బ్రిక్స్‌లో రిక్రూట్మెంట్ మేనేజర్‌నని పరిచయం చేసుకుంది. తమ వెబ్సైట్లో రెస్టారెంట్స్ రివ్యూస్ రాయాలని, 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలని ఆ టాస్క్‌లు పూర్తి చేస్తే రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు మీకు ఆదాయం వస్తుందని నమ్మించింది.
దీంతో బాధితుడు యువతి సూచించిన వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మరిన్ని లాభాలొస్తాయని నమ్మించడంతో బాధితుడు మొదట కొంత డబ్బు వెచ్చించడంతో కొంత తిరిగి చెల్లించారు. దాంతో దఫ దఫాలుగా రూ.6.7 లక్షలు పెట్టుబడి పెట్టాడు, అయితే స్క్రీన్‌పై రూ.13.67 లక్షలు కన్పిస్తుండడంతో వాటిని విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే అది నిరాకరించడంతో మోసాన్ని గుర్తించి మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.