Hyderabad | వనస్థలిపురం, ఏప్రిల్ 10 : గురువారం సాయంత్రం వచ్చిన గాలి దుమారానికి ఓ తాటి చెట్టు కూలి ట్రాన్స్ఫార్మర్పై పడిన ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని స్నేహమయి నగర్ కాలనీలో ఈ సంఘటన జరిగింది. ట్రాన్స్ఫార్మర్కు కొద్ది దూరంలో ఉన్న తాటి చెట్టు భారీ గాలి దుమారానికి కూలింది. దీంతో ఆ తాటి చెట్టు ట్రాన్స్ఫార్మర్పై విరిగిపడింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. విరిగిపడిన తాటి చెట్టు కరెంటు తీగలపై ఒరిగి ఉండడంతో అటు నుంచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వనస్థలిపురం నుంచి శివారు కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి కావడం నిత్యం వందల సంఖ్యలో వాహనాలు మనుషులు వెళ్లే రహదారి కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సంఘటనతో స్నేహమయి నగర్ సమీపంలోని సుమారు 20 కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఓవైపు గాలి మరోవైపు తేలికపాటి వర్షం పడుతుండడంతో ఏమి చేయలేని స్థితిలో డిఆర్ఎఫ్ బృందం వేచి చూసింది. కాగా వెంటనే స్పందించాల్సిన డిజాస్టర్ టీం, జిహెచ్ఎంసి అధికారులు, విద్యుత్ అధికారులు ఆ స్థాయిలో స్పందించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనే ఫిర్యాదులు..
స్నేహమయినగర్ కాలనీలో తాటి చెట్టు ప్రమాద భరితంగా ఉందని గతంలోనే స్థానికులు ఫిర్యాదులు చేశారు. జిహెచ్ఎంసి, విద్యుత్ శాఖకు, ప్రజా ప్రతినిధులకు గతంలోనే ఫిర్యాదులు చేశారు. తాటి చెట్టు రోడ్డుపైకి, ట్రాన్స్ ఫార్మర్ పైకి వంగి ఉందని ఇది ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని దాన్ని తొలగించాలని ఫిర్యాదుల అందినా అధికారులు కనీసం పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అదృష్టం బాగుంది పెను ప్రమాదం తప్పిందని ఇప్పటికైనా సాహెబ్ నగర్ శివారులో ప్రమాద భరితంగా ఉన్న చెట్లను తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.