ఖైరతాబాద్, జనవరి 1 : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి మరో ఇంట్లో శవమైన కనిపించాడు. పంజాగుట్ట, ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ఎల్లారెడ్డిగూడలోని బీఎస్ఎన్ఎల్ గల్లీలో నివాసముండే విష్ణు రూపాని (45) కిరాణ వ్యాపారస్తుడు. గత నెల 29న ఇంట్లో భార్యతో పని ఉందంటూ బయటకు వెళ్లాడు. 24గంటలు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం లేదు. దీంతో ఆయన సోదరుడు మహేశ్ రూపాని 30న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీలతో పాటు సెల్‌ఫోన్ సిగ్నల్‌ను ట్రేస్ చేశారు. దాని ఆధారంగా ఎస్ఆర్నగర్ పీఎస్ పరిధిలోని బుద్ధనగర్‌లో ఓ గదిలో ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే దుర్వాస వస్తుండడంతో బయట నుంచి వేసిన తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, కుల్లిపోయిన స్థితిలో మృతదేహం కనిపించింది.
అనుమానాలెన్నో….
గత నెల 29న ఇంటి నుంచి బయలుదేరిన విష్ణు రూపాని ఓ గుర్తుతెలియని వ్యక్తితో ద్విచక్రవాహనంపై ప్రయాణించినట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి వెంటే ఓ బార్ అండ్ రెస్టారెంట్లో పార్శిల్ తీసుకొని బయలుదేరినట్లు ఆ ఫుటేజీల్లో కనిపించింది. ఇదిలా ఉండగా, మృతుడి షాపు పై అంతస్తులో గతంలో కిరాయి ఉన్న వ్యక్తి తన కారును తనఖా పెట్టి లక్షలాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. సదరు వ్యక్తితో కలిసి ప్రస్తుతం మృతదేహం లభించిన గదిలో కలిసి మద్యం సేవించే వారని తెలిసింది. మూడు రోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లిన విష్ణు రూపాని అదే గదిలో కుల్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. అంతేకాకుండా గది సైతం బయట నుంచి తాళం వేసి ఉంది. సీసీ ఫుటేజీల్లో అతను ప్రయాణిస్తున్న వాహనం వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి అతని వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి ఒకరేనా..ఆ గదికి ఎందుకు వెళ్లారు.. ఆ గది యజమాని ఎవరూ.. దానిని వీరికి ఎందుకు ఇచ్చాడు.. అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో ఆలస్యం….?
కనిపించకుండా పోయిన విష్ణు రూపాని ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ ఆయన సోదరుడు డిసెంబర్ 30న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు దర్యాప్తు ప్రారంభించి అతన్ని ఆచూకీ తెలుసుకోవాల్సి ఉండగా, పోలీసులు కొంత ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం కుల్లిపోయిన స్థితిలో కనిపించగా, ఫిర్యాదు చేసిన వెంటనే కనిపెట్టి ఉంటే ఇంతా జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు.