Suicide | మణికొండ, మార్చి 27 : అనుమానస్పద స్థితిలో ఓ వివాహితురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… సబితా రాయ్ కర్మాకర్, శుభజిత్ రాయ్ కర్మాకర్ భార్యాభర్తలు. తమ ఇద్దరు కుమారులతో కలిసి గత రెండు నెలల క్రితం నార్సింగికి వచ్చి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాల ఓ ఇంట్లో అద్దెకుంటూ చిన్నచిన్న కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా గురువారం ఉదయం శుభజిత్ పని కోసం బయటికి వెళ్లారు. కాసేపటికే ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతకీ ఆమె తలుపులు తెరవకపోవడంతో నాలుగేళ్ల కుమారుడు.. పక్కింటికి వారికి చెప్పాడు. స్థానికులు వచ్చి కిటికీ తలుపులు తీసి గదిలోకి చూడగా అప్పటికే సబితా రాయ్ ఆత్మహత్య చేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. అయితే గత కొన్నాళ్లుగా భార్యాభర్తల వద్ద చిన్నపాటి వివాదం చోటు చేసుకుంటుందని, గతంలోనూ సబితా రాయ్ తనకు వివాహం ఇష్టం లేదని పలువురుతో వాపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.