ఖైరతాబాద్, ఆగస్టు 25 : జలమండలి అధికారుల నిర్లక్ష్యం కొందరి చేతివాటంతో ఓ మ్యాన్‌హోల్ మాయమైంది. జలమండలి అనుమతులు లేకుండానే ప్రధాన డ్రైనేజీ లైన్‌కు పైపులు అనుసంధానం చేసిన కొందరు ఇంటి యజమానులు తమ అక్రమం బయటపడుతుందని ఏకంగా మ్యాన్‌హోల్ కనిపించకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
వివరాల్లోకి వెళితే..సోమాజిగూడ డివిజన్ బీఎస్ మక్తాలో తులసి హోటల్ ముందు ఇద్దరు ఇంటి యజమానులు ప్రధాన లైనుకు డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం డ్రైనేజీ కనెక్షన్ పొందాలంటే సంబంధిత శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా పైపులు వేసుకున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో మురుగునీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో చిన్నపాటి వర్షానికే డ్రైనేజీ నీరు రోడ్లపైకి, ఇళ్ల పరిసరాల్లోకి చేరుతోంది. దుర్వాసన భరించలేని స్థాయికి చేరుతోందని చెబుతున్నారు.