బంజారాహిల్స్, నవంబర్ 11: ఆకలి తీర్చుకునేందుకు ఆన్నదానం వద్ద క్యూలైన్లో నిలబడిన ఓ వ్యక్తి జేబులోంచి పిక్ పాకెటర్స్ డబ్బులు కొట్టేశారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన ఎర్రంశెట్టి భానుచందర్ తన కొడుకు క్యాన్సర్ చికిత్స కోసం ఈ నెల 7న బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చాడు. ఆస్పత్రిలో కొడుకును చేర్పించిన బానుచందర్ అక్కడే ఉంటున్నాడు. కాగా, ఈ నెల 10న ఆకలి వేయడంతో ఆస్పత్రి బయటకు వచ్చిన భానుచందర్‌కు అక్కడ కొంత మంది అన్నదానం చేస్తున్న దృశ్యం కనిపించింది.
అప్పటికే ఆకలిగా ఉండటం, సమీపంలో కూడా హోటళ్లు కనిపించకపోవడంతో అన్నదానం వద్ద క్యూలో నిలబడ్డాడు. కొద్ది సేపటి తర్వాత తన జేబులో చూసుకోగా.. కొడుకు చికిత్స కోసం అప్పు చేసి తెచ్చుకున్న రూ.25 వేలు నగదు కనిపించలేదు. దీంతో అక్కడున్న వారందరినీ డబ్బులు దొరికాయా అంటూ అడిగాడు. అక్కడున్న వారంతా తెలియదన్నారు. దీంతో ఆదివారం రాత్రి బాధితుడు భానుచందర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనతో పాటు క్యూలైన్లో నిలబడిన పిక్ పాకెటర్స్ డబ్బులు కొట్టేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.