సికింద్రాబాద్, మే 6: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బోయిన్పల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక కొడగు జిల్లా హగ్గడ పోస్టు కెడమల్లూరు గ్రామానికి చెందిన పీఎస్ సంజీత్ (37) గత రెండు సంవత్సరాలుగా న్యూ బోయిన్పల్లి బాపూజీనగర్‌లో ఉంటూ ఓ రీహ్యాబిలిటేషన్ కేంద్రంలో పనిచేస్తున్నాడు. గత నాలుగు నెలలక్రితం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినప్పటికీ తన సమీప బంధువు సురేశ్ భార్య రమ్య(28)ను స్వగ్రామం నుంచి వెంటబెట్టుకొని వచ్చి బాపూజీనగర్‌లో సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే మద్యానికి అలవాటుపడ్డ సంజీత్ ఈనెల 5న ఇంటి పక్కనే నివాసముండే తన తమ్ముడు హరీంద్ర ఆకాశ్‌తో కలిసి మద్యం సేవించాడు. అనంతరం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి కొంతసేపు ఇంట్లో రమ్యతో మాట్లాడాడు. ఉక్కపోత కారణంగా బంగ్లా పైకి వెళ్దామని రమ్యతో చెప్పిన సంజీత్ ఆమె ఇంటి బయటకు వెళ్లగానే అతను లోపలినుంచి గడియ పెట్టుకున్నాడు. రమ్య ఎంత పిలిచినా సంజీత్ తలుపులు తెరువకపోవడంతో అనుమానం వచ్చి ఆమె హరీంద్ర ఆకాశ్‌కు ఫోన్ చేసింది. అతడు హుటాహుటిన ఇంటికొచ్చి వెనకాలవైపునున్న బాత్రూం వెంటిలేటర్ నుంచి చూసేసరికి సంజీత్ బెడ్‌షీటుతో కిటికీకి ఉరివేసుకొని కనిపించాడు.
హరీంద్ర ఆకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే తమకు ఇష్టం లేకపోయినప్పటికీ మృతుడు ఇప్పటికే ఇద్దరు పిల్లలు కలిగిన రమ్యతో సహజీవనం చేస్తుండడంతో గత కొద్దిరోజులుగా బంధువుల నుంచి ఒత్తిడి ఎక్కువవ్వడం, దీనికితోడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నందువల్లే మృతుడు ఆత్మహత్యకు ఒడిగట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.