కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 18 : ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి.. తన ఐదేండ్ల కూతురితో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం… నగరంలోని లాల్‌దర్వాజ ప్రాంతానికి చెందిన అశోక్.. రెండవ భార్య సోనీతో కలిసి దుండిగల్ మున్సిపాలిటీ, బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. దంపతు లకు దివ్య(5) కూతురు ఉన్నది.
సోనీ మూడేండ్ల కిందట రోడ్డు ప్రమాదంలో ఎడమకాలును పూర్తిగా తొలగించడంతో వీల్‌చైర్‌లో ఉంటుంది. కాగా ఉపాధి లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈ నెల 15న ఇంట్లో గ్యాస్‌సిలిండర్ లీక్‌చేసి వెలిగించగా.. సోనీ కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలు ఆర్పడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తిరిగి 16న సాయంత్రం కూతురు దివ్యను తీసుకుని అశోక్ ఇప్పుడే వస్తానని భార్యకు చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు.
ఫోన్‌చేసినా స్పందించక పోవడంతో ఆం దోళన చెందిన సోని.. 17న మీర్పేట్లో అర్ధరాత్రి వీల్‌చైర్‌పై ఆచూకీ కోసం తిరుగుతుండగా అక్కడి పోలీసులకు కన్పించగా వివరాలు అడిగి ఆమెను ఇంటికి పంపించారు. గురువారం ఉదయం మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాల వెనకాల ఉన్న చెరువులో వ్యక్తి, పాప శవాలు తేలాయని 100కు వచ్చిన సమాచారంతో పేట్ బషీరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు జే బులో లభించిన ఆధారాల మేరకు మృ తుడి భార్యకు సమాచారం ఇచ్చి.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.