బేగంపేట్, జూన్ 21: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాటిగడ్డలో ఉన్న సన్స్టీల్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. స్టీల్ దుకాణంలోని లాకర్ నుంచి రూ.48లక్షలు అపహరణకు గురైనట్లు దుకాణ యజమాని గిరీశ్ జైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. బేగంపేట పాటిగడ్డలోని సన్ ఐనక్స్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందని గోడౌన్ ఉంది. గోడౌన్లోనే సంస్థకు చెందిన కార్యాలయాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి. కార్యాలయం క్యాబిన్ కు ఉన్న రేకులను తొలగించిన దొంగలు టేబుల్ సొరుగులో నుంచి రూ.48 లక్షల నగదును దొంగిలించుకుపోయారు. ఉదయాన్నే గుర్తించిన యజమాని గిరీష్ జైన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే దుకాణంలో పనిచేసే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తే ఈ చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో నమోదైందని దుకాణ యజమాని పోలీసులకు చెప్పారు. ఘటనాస్థలాన్ని నార్త్ జోన్ డీసీపీ రశ్మిపెరుమాల్ సందర్శించి చోరీ జరిగిన తీరును పరిశీలించారు.