Hyderabad | బంజారాహిల్స్, మే 25 : అనుమానంతో భార్యను కత్తితో నరికి చంపేందుకు యత్నించిన భర్తను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా అగ్రహారం ప్రాంతానికి చెందిన ఏ.అప్పలరాజు (51) అనే వ్యక్తి సినీ పరిశ్రమలో డ్రైవర్గా పనిచేస్తూ ఫిలింనగర్లోని జ్ఙానీజైల్సింగ్నగర్లో నివాసం ఉంటున్నాడు. అతడికి భార్య వెంకటరమణమ్మ(40)తో పాటు ఇద్దరు పిల్లలున్నారు. భార్య కూడా షూటింగ్ పనుల్లోకి వెళ్తుంటుంది. కాగా తన భార్య వేరొకరితో స్నేహంగా ఉంటుందన్న అనుమానం పెంచుకున్న అప్పలరాజు తరచూ ఆమెతో గొడవపడేవాడు.
ఈ క్రమంలో ఆమెను ఎలాగైనా అంతం చేయాలనే లక్ష్యంతో 15 రోజుల క్రితం సొంతూరుకు వెళ్లి కొబ్బరి బోండాలు కొట్టే కత్తిని కొనుక్కుని వచ్చాడు. శనివారం రాత్రి భార్యతో ఇదే విషయంలో గొడవపడ్డాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం గొడవ పెద్దవగానే కత్తితో నరికేందుకు ప్రయత్నించడంతో అప్రమత్తమైన వెంకటరమణమ్మ చేతి అడ్డం పెట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దీంతో మరోసారి దాడికి యత్నించడంతో ఇంట్లోంచి బయటకు పరుగులు పెట్టింది. ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తున్న అప్పలరాజును స్థానికులు అడ్డుకున్నారు. ఈ మేరకు బాధితురాలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.