Hyderabad | సిటీబ్యూరో, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): విజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే హైదరాబాద్, సైబరాబాద్‌లో అధిక నేరాలు నమోదయ్యాయి. అదే రాచకొండ కమిషనరేట్‌లో సైకిల్ పెట్రోలింగ్, నిర్మానుష్య ప్రాంతాల్లోనూ పెట్రోలింగ్ నిర్వహించడంతో రెండు కమిషనరేట్ల కంటే తక్కువగానే నేరాలు నమోదయ్యాయనే వాదన వినిపిస్తున్నది. హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో సెల్‌ఫోన్ స్నాచింగ్‌లు పెరిగిపోవడం, హత్యలకు కూడా దొంగలు తెగబడిన ఘటనలు ఉన్నాయి. సరైన సమయంలో పెట్రోలింగ్ పోలీసులు స్పందించలేదని.. విజుబుల్ పోలీసింగ్ లేకపోవడంతో సెల్‌ఫోన్ స్నాచర్లు రెచ్చిపోయారనే ఆరోపణలు వస్తున్నాయి. అదే కోవలో సైబరాబాద్‌లోనూ అధికంగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు విడుదల చేసిన వార్షిక నివేదికలో సైబరాబాద్‌లో 64%, హైదరాబాద్‌లో 41%, రాచకొండలో 4% నేరాలు పెరిగినట్లు వెల్లడైంది.
వచ్చే ఏడాదైనా గాడిలో పడుతుందా..
మొదటి సంవత్సరం భారీగా నేరాలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. వచ్చే ఏడాదైనా శాంతి భద్రతలు గాడిలో పడుతాయా? అని నగర వాసులు చర్చించుకుంటున్నారు. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తూ..విజిబుల్ పోలీసింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే.. నేరాలు తగ్గించేందుకు అవకాశముంటుందని సూచిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సిబ్బంది కూడా సిటీ పోలిసింగ్‌పై పట్టు తెచ్చుకోవాలని.. ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ నేరాలను తగ్గించేందుకు నిరంతరం ప్రయత్నిస్తే..ఉత్తమ ఫలితాలు వస్తాయంటూ ప్రజలు సూచనలు చేస్తున్నారు.
నేరం జరిగితే..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బిజిబుల్ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. ప్రతి పెట్రోలింగ్ వాహనం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించేది. ఆయా పెట్రోలింగ్ వ్యవస్థ పర్యవేక్షణను నిరంతరం ఐటీ సెల్ నుంచి పరిశీలించారు. పోలీసులు ఎక్కువగా బయట కనిపిస్తుండటంతో దొంగతనాలు చేసేవారు… ఇతర నేరాలు చేసేవారిలో భయం అనేది ఉండేది. ఏం చేసినా పోలీసులకు దొరికిపోతామనే భయం ఆయా నేరగాళ్లలో ఉండేది. దీంతో చాలా వరకు నేరాల సంఖ్య తగ్గిపోయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి 8 నెలల పాటు వ్యవస్థ అంతా అస్తవ్యస్థంగా మారింది. తరచూ అధికారులను మారుస్తూ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి నెలకొన్నది. కిందిస్థాయి సిబ్బందిలో జవాబుదారితనం కొరవడింది. అంతర్రాష్ట్ర ముఠాలు తిరిగి హైదరాబాద్ వైపు రావడం మొదలుపెట్టాయి. లక్షలాది సీసీ కెమెరాలు పనిచేయకుండా పోయాయి. కెమెరాల నిర్వహణ గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో చాలా వరకు కెమెరాలు పాడయ్యాయి. నేరం జరిగితే వెంటనే నేరగాళ్లను పట్టుకోలేని పరిస్థితి నెలకొంది.