సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి గుండె ఆరోగ్యం అత్యంత ప్రధానమైనదని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ విభాగాధిపతి నితిజ్ఞ హర్కారా అన్నారు. బుధవారం రెనోవా దవాఖాన సౌజన్యంతో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ విభాగాధిపతి నితిజ్ఞ హర్కారా ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులకు నిర్వహించిన గుండె వైద్య శిబిరంలో దాదాపు 500 మందికి పైగా ఉదోగ్యులకు ఏఐ ఆధారిత గుండె పరీక్షలు జరిపారు. ఈసీజీ, 2డి-ఎకో, బీపీ, జీఆర్బీఎస్ వంటి వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు కార్డియాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్ వైద్యులతో ఉచిత కన్సల్టెషన్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ విభాగాధిపతి నితిజ్ఞ హర్కారా మాట్లాడుతూ ప్రస్తుతం హృద్రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, ముందస్తు పరీక్షలతో గుండెకు పొంచి ఉన్న ముప్పును తెలుసుకుంటే కాపాడవచ్చన్నారు. ప్రస్తుతం వైద్యరంగంలో వస్తున్న పెను మార్పులలో భాగంగా గుండె పరీక్షలకు సంబంధించి కృత్రిమ ఆధారిత గుండె పరీక్షలు అందుబాటులోకి వచ్చాయని, ఇవి కేవలం వైద్య పరీక్షలు మాత్రమే కాదని, వీటి వల్ల రోగుల ప్రాణాలు కాపాడే వీలున్నందున వీటిని సామాజిక బాధ్యతగా తీసుకోవాలని నితిజ్ఞ సూచించారు.
ప్రతి పౌరుడూ ఈ విషయంలో అత్యంత జాగృతతో ఉంటూ ఇలాంటి పరీక్షలు చేయించుకున్నప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, ఎంపీ బలరామ్ నాయక్, తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీగిరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రేమ్, కార్యవర్గ సభ్యులు రెనోవా హాస్పిటల్ డైరెక్టర్ టీవీ.నగేష్, డా.సోహెబ్ అహ్మద్, డా.జవహర్, కార్డియాలజిస్టులు డా.రవీంద్రనాథ్, డా.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.