మాదన్నపేట/సైదాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : ఇంటి ముందు కూర్చున్న ఓ వ్యాపారిపై గుంపుగా వచ్చిన ప్రత్యర్థి వర్గం కత్తులతో దాడిచేసి కిరాతంగా హతమార్చింది. హత్యకు గల కారణాలపై భిన్నవాదనలు విన్పిస్తున్నాయి. మంగళవారం తెల్లవారు జామున ఇంటి ముందు ఉన్న వ్యక్తిని నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు కత్తులతో పొడిచి చంపిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఐఎస్ సదన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాంచంద్రనగర్ ప్రాంతానికి చెందిన తారీక్ అలీ ఖాద్రి అలియాస్ బాబా ఖాన్ (40) రియల్ ఎస్టేట్ వ్యాపారీ.
ఇతడికి రేషన్ బియ్యం అక్రమంగా వ్యాపారం చేసే వారితోనూ పరిచయం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక వ్యవహారాల విషయంలో ప్రత్యర్థులతో గొడవలు జరిగాయి. ఈ గొడవల నేపథ్యంలో ప్రత్యర్థి వర్గం పక్కా ఫ్లాన్‌తో సోమవారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో మూడు బైక్‌లపై ఆరుగురు వ్యక్తులు కత్తులతో వచ్చి ఇంటిముందు నిల్చున్న తహరీక్ అలీపై కత్తులతో విచక్షణ రహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. నంబర్ ప్లేట్లు తీసేసి ఈ ముఠా పక్కా ముందస్తు ప్లాన్‌తో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మృతుడికి రాజకీయ నేపథ్యం కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రియల్ ఎస్టేట్, రేషన్ బియ్యం అక్రమ తరలింపునకు సంబంధించిన ఆర్థిక పరమైన విషయంలో ప్రత్యర్థులతో గొడవ జరగడంతో ప్రత్యర్థులు తారీక్ అలీని హత మార్చేందుకు సుఫారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే సుఫారీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించి అదను చూసి సోమవారం తెల్లవారు జామున హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో దృష్యాలు రికార్డు కావడం, ఆ సమయంలో నిందితులు ఉయోగించిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఈ గ్యాంగ్‌ను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఘటనకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఐఎస్ సదన్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తెలిపారు.