Hyderabad | బంజారాహిల్స్, ఆగస్టు 9 : నాలుగేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన కన్నతండ్రిపై బంజారాహిల్స్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో నివాసం ఉంటున్న మహిళకు 2017లో అఫాన్ అనే వ్యక్తితో రెండో పెళ్లి జరిగింది. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. గత కొన్నిరోజులుగా తన కుమార్తె ముభావంగా ఉండడంతో పాటు చిన్న విషయానికే బెంబేలెత్తిపోవడం, తీవ్రమైన భయంతో వణికిపోవడాన్ని తల్లి గమనించింది.
ఆమె ప్రవర్తనలో విపరీత ధోరణిని చూసిన తల్లి ఏమైందని ఆరా తీసింది. తండ్రి అఫాన్ తనపై చేసిన అఘాయిత్యాన్ని తెలిసీ తెలియని భాషలో చెప్పింది. దీంతో ఆమెపై లైంగికదాడి చేసినట్లు గుర్తించిన బాధితురాలి తల్లి బాలికను సైక్రియాటిస్ట్ వద్దకు తీసుకువెళ్లింది. ఆమెపై లైంగికదాడి జరగడంతోనే ప్రవర్తనలో మార్పు వచ్చిందని తేల్చారు. నెలరోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై తండ్రి లైంగికదాడికి దిగాడని తేలింది. ఈ విషయాన్ని గురించి తెలుసుకున్న మహిళ తన భర్తను ఇంట్లోకి రానివ్వడం లేదు. కాగా రెండ్రోజుల క్రితం అఫాన్ తండ్రితో పాటు బంధువులు వచ్చి మహిళను తీవ్రపదజాలంతో దూషించారు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా బీఎన్ఎస్ 65(2)తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.