మియాపూర్ , డిసెంబరు 15 : విలీన మున్సిపాలిటీలు, నూతన వార్డుల విభజనపై అభ్యంతరాల స్వీకరణకు చివరి రోజైన సోమవారం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ప్రజాప్రతినిధులతో కిక్కిరిసిపోయింది. తమ ప్రాంతాలలో జరిగిన విలీనంపై పెద్ద సంఖ్యలో తమకున్న అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేకు మంగళవారం ఇక్కడి కార్యాలయంలో అందించారు. పటాన్ నియోజకవర్గ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో కొంత భాగాన్ని విడదీసి వేరే వార్డులో విలీనం చేసారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతంలో వేలాదిగా ప్రజలు, ఓటర్లున్నారని దానిని రెండు వార్డులుగా ఏర్పాటు చేయాలని కోరారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీలో 1.20 లక్షలకు పైగా ఓటర్లుండగా అదనంగా కేవలం ఒకే వార్డు చేసారని, జనాభా ప్రాతిపదికన అదనంగా మరో రెండు వార్డులు కావాలని అభ్యర్థించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అదనంగా మరో వార్డును ఏర్పాటు చేయాలని విన్నవించారు. భౌగోళికంగా బొల్లారం మియాపూర్ ప్రాంతానికి దగ్గరగా ఉండగా…ఆ మున్సిపాలిటీని శేరిలింగంపల్లి జోన్లో కాకుండా కూకట్పల్లిలో విలీనం చేసారని, అక్కడి నుంచి విడదీసి శేరిలింగంపల్లిలో కలపాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం జోనల్ కార్యాలయాన్ని విలీన మున్సిపాలిటీలకు దగ్గరలో ఏర్పాటు చేయాలని కోరారు. పటాన్ చెరు సర్కిల్లో జేపీ నగర్ పేరుతో వార్డును ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ప్రజాప్రతినిధుల అభ్యంతరాలను కమిషనర్ దృష్టికి తీసుకెళామని జోనల్ కమిషనర్ హేమంత్ పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి డివిజన్లో అదనంగా మసీదుబండ వార్డును ఏర్పాటు చేసినప్పటికీ అందులో కేవలం 15 వేల ఓట్లు మాత్రమే బదలాయించారని, శేరిలింగంపల్లిలో పెద్ద మొత్తంలో ఉన్న ఓట్లను మసీదుబండ వార్డుకు బదలాయించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ భాజాపా ఇంఛార్జి రవికుమార్ యాదవ్ జడ్సీని కోరారు. ఈ మేరకు తమ అభ్యంతరాన్ని లిఖిత పూర్వకంగా అందించారు. మియాపూర్ డివిజన్లో కొత్తగా ఏర్పాటు చేసిన బీకే ఎన్క్లేవ్ వార్డు పేరును మక్తాగా మార్చాలని ఆయన అభ్యర్థించారు.