మణికొండ, నవంబర్ 13: నార్సింగి పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ టెంట్ హౌస్ పూర్తిగా కాలిపోయింది. మరో ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. స్థానికులు, నార్సింగి పోలీసుల కథనం ప్రకారం.. ఖానాపూర్ గ్రామంలోని ఓ రేకుల షెడ్డులో గత కొన్నాళ్లుగా బాలాజీ టెంట్ హౌన్‌ను నిర్వహిస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా నిర్వాహకులు పూజలు ముగించుకుని టెంట్‌హౌస్ మూసి వెళ్లిపోయారు. రాత్రి పదిగంటల సమయంలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై నీళ్లు చల్లేప్రయత్నం చేశారు. ప్రయోజనం లేకపోవడంతో అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు.
అప్పటికే పక్కనే ఉన్న ఓ మూడంతస్తుల భవనం పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో టెంట్ హౌస్‌లోని రూ.50 లక్షల విలువజేసే సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తాసుకొచ్చారు. టెంట్‌హౌస్ యజమాని కుమ్మరి శేఖర్ ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పక్కనే ఉన్న ఇంటి యజమాని సైతం తన ఇల్లు కూడా పాక్షికంగా కాలిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీపావళి పటాకులు వచ్చిపడ్డాయా.? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాల్చారా.. ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగిందా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.