కంటోన్మెంట్, మే 20: బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్‌లో లంచం తీసుకుంటూ.. మహిళా ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ పెండ్లి విషయంలో అభిషేక్ అనే యువకుడు తన తండ్రితో గొడవపడి కొట్టడంతో.. అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హత్యాయత్నం కేసు పెట్టిన ఎస్ఐ నందిత.. అభిషేక్‌ను రిమాండ్‌కు పంపించారు. కండిషన్ బెయిల్‌పై జైలు నుంచి వచ్చిన అభిషేక్ ప్రతి సోమవారం పీఎస్‌కు వచ్చి సంతకం పెడుతున్న క్రమంలో రైటర్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్‌ను ప్రతివారం వచ్చి సంతకం పెట్టాలంటే ఇబ్బంది అవుతున్నదని, తాను గచ్చిబౌలికి వెళ్లి నివాసం ఉంటానని చెప్పగా, పదివేల రూపాయలు తీసుకున్న సదరు కానిస్టేబుల్.. ఎస్ఐ నందితకు 15వేలు ఇవ్వాలని..డబ్బులు ఇస్తే సంతకం పెట్టకుండా చూస్తారని తెలిపాడు. ఎస్ఐ నందితను సంప్రదించగా, రూ. 30 వేలు ఇవ్వాలని పోలీస్ స్టేషన్లో అందరికీ వాటాలు ఇవ్వాలని తెలిపారు.
ఏసీబీ అధికారులను రెండు రోజుల కిందట ఆశ్రయించిన అభిషేక్..వారి సూచన మేరకు ఎస్ఐని సంప్రదించాడు. సదరు ఎస్ఐ ఆదేశాల మేరకు ఆమెకు ద్విచక్రవాహనం డిక్కీలో డబ్బులు పెట్టి తాళం చెవి ఎస్ఐకి ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నందిత క్యాబిన్లో సోదాలు జరిపి కీలకపత్రాలు స్వాధీనం చేసుకుని ఆధారాలు సేకరించారు. అదేవిధంగా ఈ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో కానిస్టేబుల్ విజయ్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.