హైదరాబాద్ : ఎదిగిన బిడ్డ పెండ్లి చేసి సంతోషంగా అత్తారింటికి పంపాలని ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. ఆరుగాలం శ్రమించి పైసా పైసా కూడబెట్టినదానికి తోడు.. కష్టపడి కట్టుకున్న ఇంటిపై లోన్ తీసుకొని (Bank loan)వివాహం జరిపించాలని ఓ దళారీని ఆశ్రయించారు. తీరా దళారీ మోసం చేయడంతో ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి(Family attempted suicide) ప్రయత్నించింది. ఈ విషాదకర సంఘటన బేగంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బేగంపేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రామయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట్ ప్రకాశ్‌నగర్‌కు చెందిన బచ్చల అనసూయ, భరత్‌భూషన్ భార్యభర్తలు. వీరు తమ కుమార్తె వివాహం కోసం లోన్ కావాలని భాను ప్రకాశ్, షఫీలను ఆశ్రయించారు.
వీరు అనసూయ, భూషన్లకు 2019లో విడతల వారీగా రూ.7 లక్షల నగదు లోన్ ఇప్పించారు. వీరు లోన్ తీసుకునే సమయంలో ఇంటి పేపర్లు మార్టిగేజ్ చేయాలని చెప్పడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంకు వెళ్లి దినాకర్, రజిని పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అటుపై అనసూయ, భూషన్‌లు నెలకు రూ.15000 వేల చొప్పున కిస్తీలు కడుతూ వచ్చారు. కాగా, దళారీలు ఈ ఇంటి పేపర్లు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.40 లక్షల వరకు లోన్ తీసుకోని కిస్తీలు కట్టడం ఆపివేశారు.
దీంతో కొన్నాళ్లుగా అనసూయ, భూషన్‌లు లోన్ చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. వీటిని ఆ దళారీలకు వారు తెలపగా వాటిని పట్టించుకోవద్దంటూ సూచించారని బాధితులు తెలిపారు. మంగళవారం బ్యాంక్ అధికారులు ఇంటిని జప్తు చేసేందుకు వచ్చారు. వీరితో పాటు పోలీసులు, న్యాయవాదులు సైతం ఇంటికి చేరుకున్నారు. అనసూయ, భూషణ్‌లు వారిని అడ్డుకోని ఇంటిలోపలకి వెళ్లి అయిల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వారించి ఇరు వర్గాల వారికి సంధి కుదిర్చారు. డబ్బులు చెల్లించేందుకు మూడు రోజులు గడువు ఇప్పించడంతో ఘర్షణ సద్దు మనిగింది. బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసకోని దర్యాప్తు చేస్తున్నారు.