మాదాపూర్, మార్చ్ 26: పదేపదే కారు బ్రేక్ డౌన్ కావడంతో కస్టమర్ విసుగు చెంది షోరూంపై కరపత్రాలను పంచడంతో నిర్వాహకులకు వినియోగదారునికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ నారాయణ సింగ్ కథనం ప్రకారం … రాజ్ భవన్ కు చెందిన సామల్ల రాంబాబు న్యాయవాది. 6 నెలల క్రితం ఆయన మాదాపూర్ లోని టాటా షో రూమ్ లో టాటా సఫారీ కారును కొనుగోలు చేశాడు.
అప్పటినుండి ఇప్పటివరకు 5 సార్లు కారు పదేపదే బ్రేక్ డౌన్ కావడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. దీంతో ఈ నెల 26 న మాదాపూర్ లోని టాటా షోరూం కు చేరుకొని షోరూంపై కొన్ని విషయాలు కరపత్రంపై ప్రచురించి వచ్చిపోయే వినియోగదారులకు ఇస్తున్నాడు. దీంతో షోరూం నిర్వాహకులకు వినియోగదారునికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దీంతో ఇరువురు పోలీసులను ఆశ్రయించగా మొదటిసారి కారు బ్రేక్ డౌన్ అయినప్పుడు కస్టమర్ ఫోరంను సంప్రదించినట్లయితే ఆ కారు స్థానంలో మరో కారుని తిరిగి ఇచ్చేవారని, ఇన్ని నెలల తరువాత ఇలా చేయడం సరికాదని, షోరూం నిర్వాహకులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం వినియోగదారునికి కస్టమర్ ఫోరంను సంప్రదించమని చెప్పి పంపించారు.